అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు : కేటీఆర్ 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు : కేటీఆర్ 
  •  లోక్‌‌సభ స్థానాల పెంపు దామాషా ప్రకారం జరిగితేనే డీలిమిటేషన్‌‌కు మద్దతు
  • ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ ప్రోగ్రాంలో కేటీఆర్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం హర్యానా సోనిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలో “ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని..  రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం లోక్‌‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

‘మొత్తం లోక్‌‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు ఎలాంటి సమస్య ఉండదు” అని వెల్లడించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), సాంకేతిక మార్పులపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని కేటీఆర్ అన్నారు. ‘ప్రతి సాంకేతిక మార్పును ప్రశ్నించారు.. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగాలి” అని ఆయన అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. కరువు ప్రభావిత తెలంగాణ ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్ పరిష్కారం ఈ ప్రాజెక్టు అని చెప్పారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 2014–15లో సుమారు 44.4 లక్షల టన్నులు ఉంటే.. 2023–24లో అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇన్నోవేషన్ ఇకోసిస్టం గురించి తెలిపిన కేటీఆర్.. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల పాత్రను వివరించారు.